Kodandaram: ఈ కాలంలో కూడా ఇటువంటి దారుణాలు జరుగుతుండడం బాధాకరం: సంగీత ధర్నాపై కోదండరామ్
- భర్తపై సంగీత ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అన్యాయం
- ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోంచి గెంటేయడం విచారకరం
- వరకట్నం తీసుకురావాలని ఈ కాలంలోనూ హింసించడం ఏంటి?- కోదండరామ్
- అత్తామామలను అరెస్టు చేయాలని సంగీత చెప్పింది- ఎంపీ మల్లారెడ్డి
తన భర్త, టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హింసకు గురైన సంగీతకు న్యాయం చేయాలని టీజేఏసీ తరఫున తాము డిమాండ్ చేస్తున్నామని ప్రొ.కోదండరామ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ శివారులోని బోడుప్పల్‌కు వచ్చిన కోదండరామ్ సంగీతతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... భర్త దాడి చేసినప్పుడు ఆయనపై కేసులు పెట్టడానికి చట్టాలు ఉన్నాయని, వాటి ప్రకారం దర్యాప్తు చేయాలని అన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు.
శ్రీనివాస్‌రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించాడని, సంగీతకు పోలీసులు న్యాయం చేయాలని కోరారు. ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేయాలని అన్నారు. ఈ కాలంలో కూడా ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోంచి గెంటేయడం, వరకట్నం తీసుకురావాలని హింసించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం బాధాకరమని అన్నారు.
అంతకు ముందు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కూడా సంగీత వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... తప్పు చేసిన వారు తమ పార్టీకి చెందిన వారైనా వదిలేది లేదని అన్నారు. సంగీతకు భద్రత కల్పిస్తామని అన్నారు. అత్తామామలను అరెస్టు చేసేవరకు ధర్నా విరమించబోనని సంగీత చెప్పిందని అన్నారు.