indigo: ఇండిగోపై మరో ఆరోపణ.. వివరణ ఇచ్చిన విమానయాన సంస్థ!
- వ్యాపారవేత్త నుంచి భారత కరెన్సీని తీసుకోని ఇండిగో సిబ్బంది
- పోలీసులకు వ్యాపారవేత్త ఫిర్యాదు
- ఫెమా నిబంధనల మేరకే నడుచుకున్నాం: ఇండిగో
- అంతర్జాతీయ విమానాల్లో భారత కరెన్సీని తీసుకోబోము
విమానయాన సంస్థ ఇండిగోపై మరో ఆరోపణ వచ్చింది. ఇండిగోకి చెందిన విమానంలో ప్రయాణిస్తుండగా తనకు ఎదురైన అనుభవాన్ని తెలుపుతూ ప్రమోద్ కుమార్ జైన్ అనే వ్యాపారవేత్త పలు ఆరోపణలు చేశారు. ఆ విమానంలో విక్రయించే తినుబండారాలకు భారత కరెన్సీని ఇండిగో సిబ్బంది తీసుకోవట్లేదని తెలిపారు. తాను విమానంలో బెంగళూరు నుంచి దుబాయి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు.
ఈ విషయంపై తాను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశానని, భారత భూభాగంలో భారత కరెన్సీని తీసుకోకపోవడం రాజద్రోహం లాంటిదని అన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో తాము ఫెమా నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది. అంతర్జాతీయ విమానాల్లో తాము భారత కరెన్సీని తీసుకోబోమని తేల్చి చెప్పింది. తాము ఈ విషయాన్ని తినుబండారాల విక్రయాల మెనూలోనూ పేర్కొన్నామని తెలిపింది. భారత కరెన్సీని తీసుకునే విషయమై తాము ఆర్బీఐతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది.