america: మోదీ, సుష్మాలతో సమావేశం కోసం ఇవాంకా ఆసక్తి!
- 28న హైదరాబాదుకు రానున్న ఇవాంకా ట్రంప్
- అమెరికా-భారత్ లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్
- మేకిన్ ఇండియా-అమెరికా ఫస్ట్ నినాదాలు విరుద్ధమైనవి కాదు
గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా పేర్కొంది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఇవాంకా భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను కలిసి మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అమెరికా, భారత్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు తమ రెండు దేశాల మధ్య ఉన్న బంధానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో ‘మేక్ ఇన్ ఇండియా’కు పిలుపునివ్వగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం అందుకున్నారని ఆయన చెప్పారు. ఈ రెండు నినాదాలు పరస్పరం ఒకలాంటివే కాదన్న ఆయన, విరుద్ధమైనవి కూడా కావని అన్నారు. ఈ రెండు నినాదాల మధ్య ఎలాంటి సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరి ప్రాధాన్యాలు వారికి ఉంటాయని, వాటికి అనుగుణంగా నినాదాలు రూపొందుతాయని ఆయన అన్నారు. ప్రతి దేశం తమ అభివృద్ధిని కోరుకోవడం సహజమని ఆయన చెప్పారు. ఆ నినాదాలకు అనుగుణంగా పని చేస్తారని, అయితే అదే నినాదం ప్రపంచ వ్యాప్తంగా ఉండదని ఆయన తెలిపారు.