telangana: తెలంగాణ మంత్రికి ఢిల్లీ తెలంగాణ భవన్ లో చేదు అనుభవం
- పురస్కారం కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రి
- 'శబరి'లో గది కేటాయించాల్సి ఉండగా 'స్వర్ణముఖి'లో గది కేటాయింపు
- ఆహారం కావాలంటే గులాటీకి వెళ్లి తిని రమ్మన్న సహాయ సిబ్బంది
తెలంగాణ మంత్రికి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి పేరు గోప్యంగా ఉంచిన సదరు ఘటన వివరాల్లోకి వెళ్తే... పురస్కారం అందుకునేందుకు తెలంగాణ మంత్రి ఢిల్లీ వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అయితే ప్రొటోకాల్ సిబ్బంది ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. విమానాశ్రయం నుంచి తీసుకొచ్చిన వ్యక్తి భవన్ వరకు వచ్చి వెళ్లిపోయాడు. దీంతో ఆయన స్వర్ణముఖి బ్లాకులో తనకు కేటాయించిన గదికి వెళ్లారు. అనంతరం గదిలో ఫ్రెషప్ అయి, రిలాక్స్ అవుతూ సహాయకుడిని పిలిచి, భోజనం తీసుకురావాలని కోరారు.
దానికి అతను ‘‘ఇప్పుడిక్కడ భోజనం దొరకదు. ‘గులాటి’ (సమీపంలో పేరొందిన భోజనశాల)కి వెళ్లండి’’ అన్నాడు. దీంతో ఆయన షాక్ తిన్నారు. దీంతో మంత్రిగారిని గుర్తించిన ఆంధ్రాభవన్ సిబ్బంది ఒకరు హుటాహుటిన క్యాంటీన్ నుంచి భోజనం తెచ్చి ఆయన కడుపునింపాడు. దీంతో పర్యటన ముగిసిన అనంతరం హైదరాబాదు చేరుకున్న ఆయన జీఏడీలో ఫిర్యాదు చేస్తూ, 'మంత్రినైన నన్నే పట్టించుకోలేదు' అంటూ పేర్కొన్నారు.
అంతే కాకుండా తెలంగాణ మంత్రులకు గదులు కేటాయించాల్సింది 'శబరి'లో అయితే తనకు 'స్వర్ణముఖి'లో గది కేటాయించడంపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలకు రంగం సిద్ధమైందని సమాచారం.