parital sunita: జగన్ ఆల్ ఫ్రీ అంటున్నాడు... నా బొట్టు తుడిచిన వారిని నమ్మొద్దు: పరిటాల సునీత
- ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దు
- జగనూ రాడు, రోజానూ రాదు
- భయంతో ఉన్న నన్ను చంద్రబాబే బయటకు తీసుకొచ్చారు
2019లో అధికారంలోకి వస్తామంటూ వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యే రోజా కలలుగంటున్నారని... వారి ఆశలు అడియాశలు అవుతాయని ఏపీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే ఆలోచనలు అనవసరమని... జగనూ రాడు, రోజానూ రాదు అని డ్వాక్రా మహిళలను ఉద్దేశించి అన్నారు. రోజాకు ఏమి తెలుసని, ఆమెను నమ్మి ఆమె వెంట మహిళలు వెళ్లాలని ఎద్దేవా చేశారు.
రాజశేఖరరెడ్డి హయాంలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అయిపోయానని... ఇప్పుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానంటూ జగన్ ప్రకటిస్తుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డ్వాక్రా మహిళలు నెలకు రూ. 10వేలు సంపాదించుకునేలా వారికి రుణాలు ఇస్తున్నామని చెప్పారు. పసుపు, కుంకుమ పథకం కింద రూ. 10 వేలు అందిస్తున్నామని అన్నారు. 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు చంద్రన్నకు అక్కాచెల్లెళ్లుగా ఉన్నారని చెప్పారు. చంద్రన్న పెళ్లి కానుక, చనిపోయిన సమయంలో రూ. 5 వేలు ఇవ్వడంలాంటి పథకాలను ప్రజలకు డ్వాక్రా సంఘాల మహిళలు వివరించాలని కోరారు.
పాదయాత్రలో జగన్ 'అన్నీ ఫ్రీ' అంటున్నారని... 45 ఏళ్లకే పింఛన్ అంటున్నారని సునీత ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వెయ్యి ఇస్తుంటే, వేలం పాట మాదిరి జగన్ రూ. 2 వేలు అంటున్నారని విమర్శించారు. తన బొట్టును తుడిచినవారిని నమ్మవద్దని కోరారు. తన భర్తను హత్య చేసిన తర్వాత తాను భయపడిపోయి బయటకు కూడా రాలేక పోయానని... చంద్రబాబే 'భయపడవద్దు, బయటకు రండి' అంటూ తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. మైక్ పట్టుకోవడం కూడా చేతకాని తనను ఇంత స్థాయికి తీసుకొచ్చారని తెలిపారు.