YSRCP: ఈడీ మనీ లాండరింగ్ జాబితా: టాప్-10లో వైసీపీ అధినేత జగన్.. రూ.368 కోట్ల మనీలాండరింగ్!

  • 12 మందితో జాబితా విడుదల చేసిన ఈడీ
  • 31 షెల్ కంపెనీల ద్వారా రూ.368 కోట్లు తరలించిన జగన్
  • వెయ్యికిపైగా షెల్ కంపెనీలను గుర్తించిన ఈడీ

హవాలా మార్గంలో విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు తరలించి తర్వాత వాటిని పెట్టుబడుల రూపంలో తిరిగి తెచ్చుకోవడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిది అందెవేసిన చెయ్యి అని ఈడీ రూపొందించిన జాబితా చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. భారీ స్థాయిలో మనీ లాండరింగ్‌కు పాల్పడిన తొలి 12 మంది వ్యక్తులు/సంస్థల జాబితాలో జగన్ కూడా ఉన్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది.

షెల్ కంపెనీలు పెట్టి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు తరలించారన్న ఆరోపణలు ఉన్న వారిపై ఈడీ విచారణ చేపట్టింది. రూ.200 కోట్లకుపైగా మనీ లాండరింగ్‌కు పాల్పడిన వారి జాబితా రూపొందించింది. ఇందులో 12 మంది వ్యక్తులు /సంస్థలు ఉండగా అందులో జగన్ స్థానం పది.

ఈడీ రూపొందించిన జాబితాలో ఇద్దరు మాత్రమే రాజకీయ నాయకులుండగా వారిలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పదో స్థానంలో ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నేత చగన్ భుజ్‌బల్‌ది 12వ స్థానం. వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు 31 షెల్ (ఉత్తుత్తి) కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రూ.368 కోట్లను హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్టు ఈడీ అంచనా వేసింది. చగన్ భుజ్‌బల్ 81 షెల్ కంపెనీల ద్వారా రూ.200 కోట్లను విదేశాలకు తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, జలంధర్, రాయ్‌పూర్, చెన్నై, పనాజీ నుంచి పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతున్నట్టు ఈడీ గుర్తించింది. రాజకీయాల్లో అవినీతికి పాల్పడిన సొమ్ముతోపాటు బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాదం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్మును హవాలా ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్టు ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న మొత్తం వెయ్యికిపైగా షెల్ కంపెనీలను ఈడీ గుర్తించింది. ఈడీ జాబితా ప్రకారం.. సూరత్‌కు చెందిన అప్రోజ్ మహమ్మద్ హసన్ ఫట్టా, మదన్‌లాల్ కలిసి 30 షెల్ కంపెనీల ద్వారా ఏకంగా రూ.5396 కోట్లు తరలించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News