Jagan: జగన్ అవినీతితో రాష్ట్ర పరువు పోతోంది.. సీబీఐ కేసుల్లో అప్రూవర్ గా మారాలి: బొండా ఉమా
- జగన్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ నిర్ధారించింది
- సీఎం పదవిపై వ్యామోహంతోనే పాదయాత్ర
- ప్రజా సంక్షేమంపై జగన్ కు ఆసక్తి లేదు
200 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్ కు పాల్పడిన 12 మంది వ్యక్తులు/సంస్థలతో కూడిన జాబితాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విడుదల చేసింది. ఇందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రూ. 368 కోట్లను హవాలా మార్గంలో జగన్ విదేశాలకు తరలించారని ఈడీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ నేత బొండా ఉమా మండిపడ్డారు. జగన్ చేసిన అవినీతితో రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని ఆయన అన్నారు. 31 డొల్ల కంపెనీల ద్వారా రూ. 368 కోట్ల నిధులను విదేశాలకు తరలించినట్టు ఈడీ నిర్ధారించిందని చెప్పారు. సీబీఐ కేసుల్లో జగన్ అప్రూవర్ గా మారాలని సూచించారు. ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతోనే జగన్ పాదయాత్రను చేపట్టారని... ప్రజా సంక్షేమంపై ఆయనకు ఎంతమాత్రం ఆసక్తి లేదని విమర్శించారు. ఏపీలో అవినీతిపరులకు స్థానం లేదని అన్నారు.