Hyderabad: సర్వాంగ సుందరంగా ముస్తాబైన హైదరాబాద్.. 27న అర్ధరాత్రి ఇవాంకా ట్రంప్ రాక!
- దేశ, విదేశీ ప్రతినిధుల రాకకోసం ఏర్పాట్లు పూర్తి
- 180 మంది పారిశ్రామికవేత్తలు, డెలిగేట్లతో 27న అర్ధరాత్రి చేరుకోనున్న ఇవాంకా
- శంషాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెస్టిన్ హోటల్‌కు
- ఇవాంకా కోసం స్పెషల్ ప్రెసిడెన్షియల్ సూట్ సిద్ధం
హైదరాబాద్‌లో మరో నాలుగు రోజుల్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు నగరానికి వస్తుండడంతో హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలోని ముఖ్య ప్రాంతాలు సరికొత్త విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. సదస్సుకు వచ్చే అతిథులను ఆకర్షించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూ.56 లక్షల ఖర్చుతో ఈ అదనపు ఏర్పాట్లను చేసింది.
ఈ నెల 27న అర్ధరాత్రి అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్.. నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 180 మంది పారిశ్రామికవేత్తలు, డెలిగేట్లతో కలిసి ప్రత్యేక విమానంలో రానున్న ఆమె.. శంషాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. ఆమె తన పర్యటనలో భాగంగా నగరంలోని చార్మినార్ తో పాటు గోల్కొండ కోటను సందర్శించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ఆమె రోడ్డు మార్గంలోనే ప్రయాణించాలని భద్రతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
ఇవాంకా పర్యటన కోసం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, తెలంగాణ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే, వెస్టిన్ హోటల్లో 28 నుంచి 30వ తేదీ వరకు ఎవరికీ బుకింగ్స్ ఉండకూడదని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇవాంకా పర్యటనల నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాంకా తన భద్రతాధికారులు ఏర్పాటు చేసిన 26 వాహనాల కాన్వాయ్‌లో వెస్టిన్ హోటల్‌కు చేరుకోనున్నారు.
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 28న రాత్రి జరిగే విందుకు మోదీ, ఇవాంకాతోపాటు రెండు వేల మంది హాజరవుతారు. ఆయా ప్రాంతాల్లో రెండు వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాంక బస చేయడం కోసం మాదాపూర్‌లోని ది వెస్టిన్ హోటల్లో స్పెషల్ ప్రెసిడెన్షియల్ సూట్ సిద్ధమైంది. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. వెస్టిన్ హోటల్లో బస చేయాలంటే రోజుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అద్దె ఉంటుంది. ఇవాంక బస చేసే సమయంలో పైభాగంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలపై కూడా అమెరికన్ సాయుధ సిబ్బంది ప్రత్యేక ఆయుధాలతో భద్రతను సమీక్షిస్తారు.