Hyderabad: హైదరాబాద్లో సన్బర్న్ పార్టీ ప్రారంభం.. తుపాకీతో వచ్చి కలకలం రేపిన యువకుడు!
- గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్న్ పార్టీ
- మొదటి చెక్ పాయింట్ దాటి వెళ్లిపోయిన యువకుడు
- యువకుడిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తోన్న పోలీసులు
- స్టేడియం బయట సైతం తాగి ఊగుతోన్న యువత
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్న్ పార్టీ కోసం రెండు నెలల ముందే అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇటువంటి పార్టీల పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇటువంటి సంస్కృతి మనకు వద్దని, యువత తాగుతూ, డ్రగ్స్ తీసుకుంటూ పాడైపోతున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు కొన్ని నిబంధనలతో సన్బర్న్ పార్టీకి హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం అనుమతి ఇచ్చింది.
దీంతో కొద్ది సేపటి క్రితం సన్బర్న్ పార్టీ ప్రారంభమైంది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో నాలుగు రోజుల్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు హైదరాబాద్లోనే జరుగుతుండడంతో సన్బర్న్ పార్టీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది. మొదటి చెకింగ్ పాయింట్ నుంచి అవలీలగా వెళ్లిపోయిన ఆ వ్యక్తి రెండో చెకింగ్ పాయింట్లో దొరికిపోయాడు.
అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తుపాకీని ఎందుకు తీసుకొచ్చాడన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో తొలిసారి జరుగుతున్న ఈ పార్టీకి యువత పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 17 ఏళ్ల లోపు బాలలను ఈ పార్టీకి అనుమతించడం లేదు. స్టేడియానికి బయట కూడా అమ్మాయిలు, అబ్బాయిలు తాగుతూ కనపడ్డారు. ఈ రోజు రాత్రి 10 గంటలకు ఈ పార్టీ ముగుస్తుంది.