jabardasth: జబర్దస్త్ పై అడగడానికి మీడియా ఎవరు? మహిళా సంఘాలు ఎవరు?: నాగబాబు
- ఏది బూతు అనేది నిర్ణయించాల్సింది మీడియా, సంఘాలు కాదు
- ప్రేక్షకులు నిర్ణయించాలి
- దీనిపై రెస్పాండ్ కావాల్సిన అవసరం నాకు లేదు
వివాదాస్పద 'జబర్దస్త్' టీవీ కార్యక్రమంపై అటు హెచ్చార్సీలో, ఇటు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో, 'ఏది బూతు? ఏది కామెడీ?' అంటూ టీవీ9లో ఓ లైవ్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జబర్దస్త్ నటుడు హైపర్ ఆదితో మాట్లాడేందుకు టీవీ9 ప్రయత్నించగా అతను రెస్పాండ్ కాలేదు. దీంతో, జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబుతో మాట్లాడేందుకు యాంకర్ ప్రయత్నించారు. టీవీ9 కాల్ కు నాగబాబు రెస్పాండ్ అయ్యారు.
అయితే, ఈ కార్యక్రమంలో లైవ్ లో మాట్లాడటానికి నాగబాబు తిరస్కరించారు. మీడియా, మేధా సంఘాలు, మహిళా సంఘాలు వీరెవరు ఉద్ధరించడానికి? అంటూ టీవీ9ను ఆయన ప్రశ్నించారు. వీళ్లకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఏది బూతు? ఏది కామెడీ? అనే విషయాన్ని నిర్ధారించాల్సింది మీడియా కాదు, ఈ సంఘాలు కాదని... ప్రేక్షకులు మాత్రమే అని అన్నారు.
అయితే, ఇదంతా లైవ్ కార్యక్రమంలో జరగలేదు. ఫోన్ ఇన్ తీసుకోవడానికి టీవీ9 టీమ్ ప్రయత్నించినప్పడు జరిగిన విషయం. ఈ విషయంపై తన రెస్పాన్స్ అడగడానికి ఫోన్ కూడా చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. నాగబాబు మాటలను టీవీ9 యాంకర్ యథావిధిగా లైవ్ షోలో వివరించి చెప్పారు.