padmawati: అసలు వాళ్ల దగ్గర కోటి రూపాయలు ఉన్నాయా?: 'పద్మావతి' తలకు వెలకట్టిన వారిపై ఉప రాష్ట్రపతి విసుర్లు
- హీరోయిన్ తలకు వెలకట్టిన వారి వద్ద అసలు అంత డబ్బుందా?
- నిరసనలు తెలిపే పధ్ధతి ఇది కాదు
- అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప ఇలా మాట్లాడకూడదు
సినిమా కళాకారులను బెదిరించడం, వారిపై దాడులకు తెగబడితే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదనీయం కాదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఓ సాహిత్య సదస్సులో పాల్గొన్న ఆయన, నిరసన తెలిపే ప్రక్రియలో భాగంగా కళాకారులపై హింసకు తెగబడతామని చెప్పడం భావ్యం కాదని, అసలు ఆ ప్రకటనలు ఇచ్చే వాళ్ల వద్ద కోటి రూపాయలు ఉన్నాయో, లేదోనని తనకు అనుమానంగా ఉందని అన్నారు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కిన 'పద్మావతి' చిత్రంపై రభస నేపథ్యంలో వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడనప్పటికీ, నిరసనలు తెలియజేయాలంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప, ఈ తరహా ప్రకటనలు కూడదని వెంకయ్య హితవు పలికారు.
ఇక పార్లమెంట్ సమావేశాలకు తక్కువ పని దినాలను కేటాయించారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ఎన్ని రోజులు సభ పనిచేసిందన్నది ప్రధానం కాదని, ప్రజలకు ఉపయోగపడే చర్చలు ఎలా సాగాయన్నదే ముఖ్యమని అన్నారు. సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని, అందుకు విపక్షాలు సహకరించాలని సూచించారు.