Chandrababu: అమరావతి నుంచి రాష్ట్రం మొత్తం వీక్షణ: ఏపీలో రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం!
- విపత్తులు, ప్రమాదాలను ప్రత్యక్షంగా చూడగలిగే సదుపాయాలు
- రాష్ట్ర అధికారులు, ప్రజలతో ఎక్కడినుంచైనా వీడియో కాన్ఫరెన్స్
- నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్
ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పరిపాలనకు ఆధునిక సాంకేతికతను మరింత జోడిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతోందన్న దానిని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా అమరావతి సచివాలయం మొదటి అంతస్తులో రూపొందించిన రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర అధికారులు, ప్రజలతో ఎక్కడినుంచైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఇందులో ఉంటుంది.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రూపొందించారు. విపత్తులు, ప్రమాదాల సమయంలో ఈ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ, సహాయ సిబ్బందిని సమన్వయం చేసే అవకాశం ఉంది. తద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ వినూత్నమైన పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ ఒకేసారి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. నేరాలను కట్టడి చేయడానికి పోలీసు వ్యవస్థకి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దీని కోసం 13 జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉంటాయని తెలిపారు.
మరిన్ని సదుపాయాలు...
- దీనిలో ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ మందిరం(బార్కో)
- అధికారి సెల్‌ఫోన్ ద్వారా ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడి నుంచే నేరుగా సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడే సదుపాయం
- ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కెమెరాలు
- త్వరలో మరో 15 వేల కెమెరాలు
- ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీ చేసే అవకాశం
- అవసరమైతే ఆయా ప్రాంతంలో డ్రోన్ల సాయంతో తాజా పరిస్థితిని చూస్తూ ఆదేశాలిచ్చే వ్యవస్థ