Kodandaram: 6 వేల ఉద్యోగాలు ఇవ్వడానికే మూడున్నరేళ్లు పడితే లక్ష ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు?: ప్రొ.కోదండరామ్
- మా పోరాటం ఆత్మగౌరవం, మార్పులకు సంబంధించింది: ప్రొ.కోదండరామ్
- కొలువులకై కొట్లాట సభకు భారీ ఎత్తున తరలిరావాలి
- ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా కొలువులకై కొట్లాట సభ జరుగుతుంది
తాము చేస్తోన్న పోరాటం ఆత్మగౌరవం, మార్పులకు సంబంధించిందని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. వచ్చేనెల 4 లేక 5న హైదరాబాద్లోని సరూర్నగర్ మైదానంలో టీజేఏసీ 'కొలువులకై కొట్లాట' సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో పర్యటిస్తోన్న కోదండరామ్.. వరంగల్ సన్నాహక సభలో పాల్గొని మాట్లాడారు. సరూర్ నగర్ సభకు భారీ ఎత్తున యువత తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా కొలువులకై కొట్లాట సభ జరుగుతుందని చెప్పారు. టీఎస్ పీఎస్సీ ఇప్పటివరకు 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని, అందులో భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 6,000 మాత్రమేనని అన్నారు. మిగిలినవన్నీ పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు. మరోపక్క, ఒక్క ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలూ ఇచ్చేస్తామని ప్రభుత్వం చెప్పుకుంటోందని ప్రొ.కోదండరామ్ అన్నారు. 6 వేల ఉద్యోగాలు ఇవ్వడానికే మూడున్నరేళ్లు పడితే, లక్ష ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఇటువంటి వారు ఒకే సంవత్సరంలో అన్ని ఎలా ఇవ్వగలుగుతారని అన్నారు.