husband: భార్య చనిపోయినట్లు క్లెయిం.. తీరా ఆ మహిళే తలుపు తెరవడంతో ఇన్సూరెన్స్ సిబ్బంది షాక్!
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఘటన
- కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం.. భార్య చనిపోయిందని నకిలీ ధ్రువపత్రం
- ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో దరఖాస్తు
- ఆరా తీయడానికి వెళ్లిన సిబ్బంది
కోటి రూపాయల డబ్బు కోసం ఓ భర్త తన భార్య చనిపోయిందని అసత్యం చెప్పాడు. డబ్బు వస్తుందని చెప్పగానే ఆ భార్య కూడా నాటకాలు ఆడింది. చివరకు ఆ జంట పోలీసులకు దొరికిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని బంజారా హిల్స్‌లో నివసించే సయ్యద్ షకీల్ ఆలం అతడి భార్య నజియా షకీల్ కలిసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రామా ఆడారు. వారు ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి 2012లో రూ.కోటి పాలసీ తీసుకున్నారు.
ఆ డబ్బును అక్రమంగా కొట్టేయాలని నెల రోజుల క్రితం తన భార్య నజియా చనిపోయినట్టుగా సయ్యద్.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి రూ.కోటి ఇన్సూరెన్స్‌కి క్లెయిమ్ చేసుకున్నాడు. దీంతో ఇన్సూరెన్స్ సిబ్బంది వివరాలను ఆరా తీయడానికి అతడి ఇంటికి వెళ్లారు. కాలింగ్ బెల్ కొట్టగానే నజియా వచ్చి తలుపు తీసింది. ఆమెను చూసిన సిబ్బంది షాక్ తిన్నారు. వారు ఆడిన నాటకాన్ని గుర్తించి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.