jc diwakar reddy: అంతా నా చేతగాని తనమే: జేసీ దివాకర్ రెడ్డి
- ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా
- చాగలమర్రికి నీరు ఇవ్వడంలో తీవ్ర జాప్యం
- రాజీనామా చేస్తానని బెదిరించిన తరువాతే కొంత నీరు
- ప్రభుత్వం ఇంకా దిగిరాలేదు... కొంత న్యాయం మాత్రం జరిగిందన్న జేసీ
అభివృద్ధికి సుదూరంగా ఉన్న అనంతపురం నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడంలో ఓ ఎంపీగా తాను విఫలం అయ్యానని జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో తాను ఎంపీగా కొనసాగడం భావ్యమా? అని అడిగారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని అన్నారు.
రాయలసీమలోని ఎన్నో ప్రాంతాలకు నీరు లభిస్తోందని, తాను అడిగిన చాగలమర్రికి మాత్రం నీరు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరిగిందని చెప్పారు. ఈ విషయంలో తాను చంద్రబాబును పలుమార్లు అడిగి విఫలం అయ్యానని అన్నారు. చాగలమర్రికి నీరు కావాలని అడుగుతున్నది తన పొలాల కోసం కాదని, ప్రజల మేలు కోసమేనని జేసీ తెలిపారు.
నీరు ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని కూడా చంద్రబాబుకు స్పష్టం చేశానని, ఆ తరువాత మాత్రమే కొంత నీరు వచ్చిందని చెప్పారు. మిగతా నాయకులు, ప్రజా ప్రతినిధుల్లా తాను మాటలు చెప్పి పబ్బం గడుపుకోలేనని, అదే తనకు మైనస్ అయిందని అభిప్రాయపడ్డారు. ఇతర నియోజకవర్గాలకు నీరిచ్చి, తనకు నీరివ్వకుండా ఉన్న రోజున తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి రాజీనామాను సమర్పించి వస్తానని స్పష్టం చేశారు.
తన హెచ్చరికలను చంద్రబాబు లైట్ గా తీసుకున్నారో లేదా సీరియస్ గా ఆలోచిస్తున్నారో అన్న విషయం తనకు తెలియదని చెప్పారు. "నేను రాజీనామా చేస్తానని చెప్పడం సంచలనమైందో, వంచలనమైందో నాకు తెలియదు. ప్రభుత్వం దిగివచ్చిందని నేను ఎందుకు అనుకోవాలి? కొంత న్యాయం చేసిందని చెప్పగలను" అని అన్నారు.