odf: బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న దివ్యాంగ బాలుడు... ప్రశంసించిన ప్రధాని!
- 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించిన మోదీ
- సైగలతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసిన తుషార్
- తన గ్రామానికి ఓడీఎఫ్ గుర్తింపు లభించేలా చేసిన బాలుడు
నిన్న ప్రసారమైన ప్రధాని 'మన్ కీ బాత్' 38వ ఎపిసోడ్లో నరేంద్రమోదీ ఓ దివ్యాంగ బాలుడి గురించి ప్రస్తావించారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా కుమ్హారీ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల తుషార్ మూగవాడైనప్పటికీ స్వచ్ఛ్ భారత్ అభియాన్ లక్ష్యం నెరవేర్చడంలో తన వంతు కృషి చేస్తుండటం చాలా ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. తుషార్ కృషి కారణంగా ఆ గ్రామానికి ఓడీఎఫ్ (ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ) గుర్తింపు లభించిందని కొనియాడారు.
ఇంతకీ తుషార్ ఏం చేస్తాడో తెలుసా? పొద్దున్నే ఐదు గంటలకు లేచి, తన గ్రామంలో ఇంటింటికి తిరిగి బహిరంగ మలవిసర్జన చేయొద్దని సైగల ద్వారా చెబుతాడు. పాఠశాలకు వెళ్లే లోగా దాదాపు 30-40 ఇళ్లకు వెళ్లి తుషార్ ఇలా ప్రచారం చేస్తాడు. అంతేకాకుండా ఎవరైనా బహిరంగ మలవిసర్జన చేస్తూ కనిపిస్తే ఈల ఊదుతూ వారిని అదిరిపడేలా చేస్తాడు. తుషార్ ఇలా చేస్తున్న కారణంగా వారి గ్రామానికి ఓడీఎఫ్ గుర్తింపు లభించింది.