padmavati: పద్మావతి వివాదం... ఖిల్జీ స్వయంగా పద్మావతిని చూశాడని ఉన్న శిలా ఫలకాన్ని మూసేసిన అధికారులు!
- చిత్తోర్ గఢ్ లో ఉన్న పద్మినీ మహల్ ముందు శిలా ఫలకం
- ఖిల్జీ స్వయంగా పద్మావతిని వీక్షించాడంటున్న చరిత్ర
- కర్ణిసేన హెచ్చరికలతో శిలా ఫలకాన్ని మూసేసిన అధికారులు
చిత్తోర్ గఢ్ కోటలోని పద్మినీ మహల్ ముందున్న ఓ పురాతన శిలా ఫలకాన్ని ఆర్కియాలజీ విభాగం అధికారులు ఇప్పుడు మూసి వేశారు. ఈ శిలా ఫలకం మీద ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ, స్వయంగా రాణి పద్మావతిని చూశాడని ఉండటమే ఇందుకు కారణం. ఈ శిలా ఫలకం తమ మనో భావాలను దెబ్బతీస్తోందని, దీన్ని ధ్వంసం చేస్తామని శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన హెచ్చరించిన నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగవచ్చన్న అనుమానంతో ఈ ఫలకాన్ని మూసి వేసినట్టు అధికారులు వెల్లడించారు.
జోధ్ పూర్ లోని ఉన్నతాధికారులను సంప్రదించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆర్కియాలజీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కర్ణిసేనలోని కొందరు చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఈ నిర్ణయాన్ని కర్ణిసేన ప్రతినిధులు మాత్రం స్వాగతించారు.