ivanka trump: ఇవాంకా పర్యటనలో 'రిజర్వ్' టైమ్... ఏం చేస్తారన్నది సస్పెన్స్!
- 40 గంటల పాటు సాగనున్న ఇవాంక పర్యటన
- 18 గంటల పాటు రిజర్వ్ టైమ్
- చార్మినార్ ను సందర్శించే అవకాశం
మొత్తం 40 గంటల పాటు హైదరాబాద్ లో ఉండే ఇవాంక, తన పర్యటనలో 18 గంటల సమయాన్ని 'రిజర్వ్' చూపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని హోటల్ లో బస చేసిన ఆమె, మధ్యాహ్నం 2:50 వరకూ ఏం చేస్తారన్నది సస్పెన్స్, ఆపై 2 గంటలకు హెచ్ఐసీసీ చేరుకునే ఆమె, 7:15 వరకూ గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో, ఆపై తెలంగాణ ప్రభుత్వం ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇచ్చే విందులోనూ పాల్గొని తిరిగి హోటల్ కు వెళతారు.
ఇక బుధవారం ఉదయం మాత్రమే సదస్సుకు హాజరై ప్రసంగించే ఆమె, తిరిగి హోటల్ కు వెళతారు. ఆపై ఓ అరగంట పాటు ట్రైడెంట్ హోటల్ లో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఆపై 5:35 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు. ఇక, ఆమె షెడ్యూల్ లో 'రిజర్వ్' అని పేర్కొంటూ చూపిన సమయంలో ఏం చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ఆ సమయంలో ఆమె చార్మినార్ వంటి చారిత్రక ప్రాంతాలను సందర్శిస్తారా? లేదా విశ్రాంతి తీసుకునేందుకు మొగ్గు చూపుతారా? అన్నది తెలియాల్సి వుంది. ఆమె చార్మినార్ కు రావచ్చన్న సమాచారం కూడా ఉండటంతో పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తనకున్న రిజర్వ్ సమయంలో ఇవాంకా, కొందరు ప్రముఖులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.