Maharashtra: అత్యాచార బాధిత విద్యార్థినిని స్కూలు నుంచి గెంటేసిన యాజమాన్యం!
- బాలికను నమ్మించి అత్యాచారం చేసిన ఆర్మీ జవాను
- స్కూలు ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని బాలికను సస్పెండ్ చేసిన యాజమాన్యం
- బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు
అత్యాచారానికి గురైన విద్యార్థినిపై స్కూలు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో ఓ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న బాలిక ఓ ఆర్మీ జవాను చేతిలో మోసపోయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన జవాను ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు.
ప్రియుడి మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాలిక అత్యాచారానికి గురికావడం, పోలీస్ స్టేషన్‌కు ఎక్కడంతో తమ స్కూలు ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని భావించిన స్కూలు యాజమాన్యం ఆమెను స్కూలు నుంచి సస్పెండ్ చేసింది. పాఠశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత బాలిక మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కేసు నమోదుకు రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు ఆరోపించాడు. దీంతో బాధిత బాలిక నేరుగా జిల్లా ఎస్పీ శివాజీ రాథోడ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. దిగొచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.