hardhik patel: అశ్లీల వీడియోలో ఉన్నది నేనా? కాదా? అన్నది ఎవరికీ అవసరం లేదు: హార్దిక్ పటేల్
- గుజరాత్ సమస్యల నుంచి పక్కదోవ పట్టించేందుకే సీడీ నాటకం
- 2 కోట్లిస్తే అదే వీడియోలో విజయ్ రూపానీ ముఖం పెడతా
- బీజేపీవి చిల్లర రాజకీయాలు
అశ్లీల వీడియోల పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలతో తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. ఆ సీడీలో ఉన్నది తానా? కాదా? అనే విషయం ఎవరికీ అవసరం లేదని అన్నారు.
సీడీలో ఉన్నదంతా కల్పితమని... పచ్చి అబద్దమని తెలిపారు. తనకు రూ. 2 కోట్లు ఇస్తే అదే వీడియోలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముఖాన్ని కూడా పెట్టగలనని చెప్పారు. బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గుజరాత్ ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని... వాటన్నింటినీ పక్కదోవ పట్టించేందుకు సీడీ పేరిట కొత్త నాటకాన్ని ప్రారంభించారని మండిపడ్డారు. ఇప్పటి నుంచి తాను స్నానం చేసేటప్పుడు కిటికీ తలుపులు కూడా మూసేస్తానని నవ్వుతూ అన్నారు.