hamish finlayson: జీఈ సదస్సులో అతి చిన్నవయసు ఎంటర్ప్రెన్యూర్ హమీష్ ఫిన్లేసన్... వయసు 13 ఏళ్లు!
- గేమింగ్ యాప్‌లు రూపొందించిన హమీష్
- అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికుడు
- తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా నుంచి రాక
హమీష్ ఫిన్లేసన్.... హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొంటున్న అతి చిన్నవయసు ఎంటర్ప్రెన్యూర్. 13 ఏళ్ల వయసులోనే గేమింగ్ యాప్‌లు తయారు చేసిన హమీష్, సదస్సుకు వచ్చినవారందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న ఈ ఆస్ట్రేలియా కుర్రాడు గేమింగ్ యాప్‌లతో పాటు సమాజానికి ఉపయోగపడే యాప్‌లను కూడా రూపొందించాడు.
అంతరించిపోతున్న తాబేళ్లను కాపాడేందుకు ఓ యాప్, ట్రాఫిక్ రూల్స్‌కి సంబంధించి ఓ యాప్ ఇలా దాదాపు 6 యాప్‌ల వరకు హమీష్ తయారుచేశాడు. టెక్నాలజీ మీద ఆసక్తితో తానెప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని, హోం వర్క్ పూర్తయ్యాక, ఖాళీ సమయాల్లో మాత్రమే తాను యాప్‌లను రూపొందించే పనిలో పడతానని హమీష్ చెప్పాడు. అతని తండ్రి గ్రామీ ఫిన్లేసన్ మాట్లాడుతూ... హమీష్ మూడో తరగతిలో ఉన్నపుడు ఎనిమిదేళ్ల వయసులోనే టెక్నాలజీ మీద ఆసక్తి చూపించడం మొదలుపెట్టాడని చెప్పారు.