hicc: మేధావులైన మహిళలను అంతమొందిస్తున్నారు.. హెచ్ఐసీసీలో దీనిపై చర్చ జరగాలి: పూనమ్ కౌర్
- మహిళలపై అఘాయిత్యాలపై కూడా చర్చ జరగాలి
- మేధావులైన మహిళలను చంపేస్తున్నారు
- అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉంది
హెచ్ఐసీసీలో కేవలం మహిళా సాధికారత మీదే కాకుండా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా చర్చ జరగాలని సినీ నటి పూనమ్ కౌర్ తెలిపింది. హైదరాబాదులోని హెచ్ఐసీసీ వేదికగా ప్రారంభమైన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా సాధికారత సాధించిన మహిళలపై జరిగే దాడులపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
గౌరీ లంకేష్ (పాత్రికేయురాలు), నఫీసా జోసెఫ్ (1997 ఫెమీనా మిస్ ఇండియా యూనివర్స్) వంటి మేధావి వర్గం మహిళలు ఆయా సమస్యలపై పోరాడారని, మూఢ విశ్వాసాలను ప్రతిఘటించారని.. అందుకే వారిని అంతమొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలపై అంతర్జాతీయ స్థాయి చర్చ జరగాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. అలాంటి చర్చ జరిగితే ఇలాంటి సదస్సులు విజయవంతమైనట్టుగా భావించాలని ఆమె ఆకాంక్షించారు.