bosnia: తీర్పు విని కోర్టులోనే విషం తాగిన యుద్ధ నేరస్తుడు... వీడియో చూడండి
- ఐక్యరాజ్యసమితి యుద్ధనేరాల ట్రైబ్యునల్‌లో ఘటన
- విషం తీసుకున్నానని ప్రకటించిన బోస్నియా కమాండర్ స్లోబోదన్ ప్రల్జాక్
- ట్రైబ్యునల్ ప్రొసీడింగ్స్‌ని నిలిపి వేసిన జడ్జి
తనకు పడిన శిక్ష గురించి విని, కోర్టులోనే విషం తాగాడో యుద్ధ నేరస్తుడు. బోస్నియా బలగాలకు చెందిన స్లోబోదన్ ప్రల్జాక్తో సహా మరో ఐదుగురికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఐక్యరాజ్యసమితి యుద్ధ నేరాల ట్రైబ్యునల్ ప్రకటించగానే, స్లోబోదన్ జేబులోంచి ఒక సీసా తీసి తాగాడు. ఆ వెంటనే అతని తరఫు న్యాయవాది విషం తీసుకున్నాడని చెప్పగానే ట్రైబ్యునల్ ప్రొసీడింగ్స్‌ని నిలిపి వేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.
1992-95 మధ్య జరిగిన బోస్నియా యుద్ధంలో వీరంతా కలిసి ముస్లింలను ఊచకోత కోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2013లో వీరిని యుద్ధనేరస్తులుగా గుర్తించారు. ఆ కేసుకి సంబంధించిన చివరి విచారణలో శిక్షను ఖరారు చేస్తూ జడ్జి తీర్పునిచ్చారు. ఆ వెంటనే స్లోబోదన్ విషం తాగానని ప్రకటించడంతో కోర్టు లోపల అయోమయ పరిస్థితి నెలకొంది. అంబులెన్స్ పిలిపించి స్లోబోదన్ని ఆసుపత్రికి పంపినట్లు తెలుస్తోంది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలియరాలేదు.