Prakash Raj: ‘పద్మావతి’పై బాధ్యతా రహిత వ్యాఖ్యలు చేయొద్దు ప్లీజ్: ప్రకాశ్ రాజ్
- సినిమాను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
- సినిమాను చూడాలంటూ సెన్సార్ బోర్డుకు మూడోసారి ఆదేశం
- నేతలు సంయమనం పాటించాలన్న విలక్షణ నటుడు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాలీవుడ్ సినిమా ‘పద్మావతి’పై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించాడు. ఈ సినిమాను చూడమని సెన్సార్ బోర్డుకు సుప్రీం కోర్టు మూడోసారి సూచించిందని, కాబట్టి సెన్సార్ పూర్తయ్యే వరకు ప్రజా ప్రతినిధులు బాధ్యతా రహిత వ్యాఖ్యలు చేయవద్దని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.
పద్మావతి సినిమాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఈ సినిమాను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మూడోసారి కొట్టివేసింది. అంతేకాక, సినిమాను వ్యతిరేకిస్తున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్‌పుత్ మహారాణి పద్మినిగా దీపికా పదుకొనె నటించింది. పద్మిని పాత్రను ఈ చిత్రంలో వక్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన కార్యకర్తలు, బీజేపీ నేతలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. సినిమాను నిషేధించాలని రోడ్డెక్కారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధిస్తున్నట్టు పేర్కొన్నాయి.