Sachin Tendulkar: 'టెన్'డూల్కర్ కే పరిమితం... బీసీసీఐ ఆదేశం!
- పదో నంబర్ జెర్సీ ఎవరూ ధరించవద్దు
- సచిన్ టెండూల్కర్ కు గౌరవ సూచకంగానే
- బీసీసీఐ అనధికార ఉత్తర్వులు
తన క్రికెట్ కెరీర్ ఆసాంతం '10' నంబర్ జర్సీ ధరించి అభిమానులను ఎంతో అలరించిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను గౌరవించుకునేలా, పదో నంబర్ జెర్సీని మరెవరూ ధరించకుండా బీసీసీఐ అనధికార ఆదేశాలు జారీ చేసింది. నం.10 జెర్సీకి వీడ్కోలు పలికేందుకు నిర్ణయించిన బీసీసీఐ, సమీప భవిష్యత్తులో ఎవరూ పదో నంబర్ చొక్కా వేసుకోబోరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
అయితే, ఎవరు ఏ నంబర్ జెర్సీ వేసుకోవాలన్న విషయాన్ని నిర్ణయించడానికి బీసీసీఐకి అధికారాలు లేకపోయినప్పటికీ, వివాదం లేకుండా ఉండాలంటే, అనధికారిక ఉత్తర్వులే మేలని భావిస్తున్న అధికారులు ఆ మేరకు ఆటగాళ్లకు సూచనలు పంపినట్టు తెలుస్తోంది. సచిన్ క్రికెట్ కు విరామం చెప్పిన తరువాత, శ్రీలంకతో మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ మాత్రమే పదో నంబర్ జెర్సీతో కనిపించిన సంగతి తెలిసిందే.
సచిన్ వంటి ఆటగాడి సంఖ్యను ఎలా ధరిస్తాడని శార్దూల్ పై విమర్శలూ వచ్చాయి. ఇక తన సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆ జెర్సీ ధరించానని శార్దూల్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సచిన్ జెర్సీ సంఖ్యను వాడకూడదన్న విషయాన్ని ఆటగాళ్లే అర్థం చేసుకోవాలని, దేశవాళీ పోటీల్లో 10ని వాడితే ఫర్లేదని, ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో మాత్రం వద్దని బీసీసీఐ ఆటగాళ్లకు స్పష్టం చేసింది.