Facebook: ఫేస్ బుక్ ఖాతా కావాలంటే చాలెంజ్ రెస్పాన్స్ పరీక్ష!
- సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న ఫేస్ బుక్
- అకౌంట్ ను వినియోగిస్తున్నది రోబో కాదని నిర్ధారించుకుంటుంది
- ఫోటో అప్ లోడ్ చేసిన తరువాతే అకౌంట్ ఓపెన్
- అనుమానాస్పద ఖాతాల విషయంలోనేనని ఫేస్ బుక్ వివరణ
సోషల్ మీడియా దిగ్గజం మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. అకౌంట్ ను వినియోగిస్తున్నది రోబో కాదని నిర్ధారించుకునేందుకు కొత్త తరహాలో చాలెంజ్ రెస్పాన్స్ పరీక్షను కస్టమర్ల ముందు ఉంచనుంది. వారి ముఖం స్పష్టంగా కనిపించేలా ఓ ఫోటోను అప్ లోడ్ చేయాలని అడుగుతుంది. ప్రస్తుతం పరీక్షా దశలో ఉన్న ఫీచర్ కు చెందిన స్క్రీన్ షాట్ ఇప్పుడు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది.
"మీ ముఖం స్పష్టంగా కనిపించేలా ఓ ఫొటోను అప్లోడ్ చేయండి. మేము పరిశీలించాక దాన్ని మా సర్వర్స్ నుంచి పూర్తిగా తొలగిస్తాం" అని ఓ విండోలో మెసేజ్ కనిపిస్తోంది. అనుమానాస్పద వాడకాన్ని గుర్తించేందుకు ఈ విధానాన్ని తయారు చేశామని ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అకౌంట్ ఓపెన్, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, చెల్లింపులు తదితరాంశాల్లో అనుమానం వస్తే, యూజర్ ఫోటోను అడుగుతామని, అది పూర్తి ఆటోమేటిక్ విధానంలో జరుగుతుందని ఆయన అన్నారు. ఇక ఫోటో అప్ లోడ్ చేసిన వెంటనే ఫేస్ బుక్ ఖాతా ఓపెన్ కాదు. ఆ ఫోటోను పరిశీలించి, సమస్య లేదని నిర్ణయించుకున్న తరువాతే ఫేస్ బుక్ మీ ఖాతాను తెరుస్తూ నోటిఫికేషన్ పంపుతుంది.