ivanka trump: ఇవాంకా ట్రంప్ చెప్పింది ఈమె గురించే... పేరు రేయాన్ క్యామలోవా.. వయసు 15 ఏళ్లు!
- జీఈఎస్‌లో పాల్గొన్న చిన్న వయసు మహిళా ఎంటర్ప్రెన్యూర్
- వాన నీటి నుంచి విద్యుత్ తయారీ మోడల్ కనిపెట్టిన రేయాన్
- రెయినర్జీ అనే సంస్థకు సీఈఓ
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ తన ప్రసంగంలో ముగ్గురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల గురించి ప్రస్తావించింది. వారిలో రేయాన్ క్యామలోవా ఒకరు. ఈ సదస్సుకు హాజరైన అతి చిన్నవయసు మహిళా ఎంటర్ప్రెన్యూర్. 'రేయాన్కి 15 ఏళ్లే... అయినప్పటికీ వాన నీటి నుంచి శక్తిని ఉత్పత్తి చేసే కంపెనీ పెట్టడానికి ఆమెకు వయసు అడ్డంకి కాలేదు' అని ఇవాంకా ప్రత్యేకంగా ప్రస్తావించింది. తన మోడల్ ద్వారా రేయాన్ వెలిగించిన ప్రతి దీపం, ప్రపంచానికి వెలుగులు తీసుకువస్తుందని ఇవాంకా కొనియాడింది.
మొదటిసారి జీఈఎస్‌కి హాజరైన రేయాన్.. రెయినర్జీ అనే సంస్థను స్థాపించింది. అజార్బైజాన్లోని క్యూబా ప్రాంతానికి చెందిన రేయాన్ ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. గాలి నుంచి విద్యుత్తును తయారు చేయగలిగినపుడు వాన నీటి నుంచి ఎందుకు తయారుచేయలేమంటూ తన తండ్రి అడిగిన ప్రశ్నకు రేయాన్ సమాధానం కనిపెట్టింది. తన మోడల్‌ను పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయడానికి 20వేల డాలర్లు అవసరం... అందుకోసం పెట్టుబడిదారులను వెతుక్కుంటూ ఈ సదస్సుకు వచ్చింది.
ఈ సదస్సులో ఆమెకు సహాయం చేయడానికి కొంతమంది ఔత్సాహికులు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తన మోడల్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఒక ప్రత్యామ్నాయ ఇంధన వనరుగానే కాకుండా గాలిలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణాన్ని క్రమబద్ధం చేయడం కూడా సాధ్యమవుతుందని రేయాన్ అంటోంది.