kvp ramchadar rao: ఏపీ సీఎం చంద్ర‌బాబుకి కేవీపీ బ‌హిరంగ లేఖ‌!

  • శాసనసభలో పోల‌వ‌రంపై ప్రకటన చేసినందుకు ధన్యవాదాలు
  • ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, నిధులపై అయోమ‌యం నెల‌కొంది
  • వాస్తవాలను వెల్లడిస్తారని ఆశించిన మా వంటి వారికి షాక్ ఇచ్చారు
  • మీరు కేంద్ర స‌ర్కారుతో ఏ ఒప్పందం చేసుకున్నారో..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోన్న పోల‌వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి బ‌హిరంగ లేఖ రాశారు. చంద్ర‌బాబు ఇటీవ‌ల పోల‌వ‌రంపై చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని విమ‌ర్శించారు. ఆయ‌న రాసిన లేఖలోని ముఖ్యాంశాలు....
 
"ఈ ఏడాది నవంబర్ 21న, శాసన సభలో మీ స్వజనుల కరతాళ ధ్వనుల మధ్య సాగిన పోలవర చారిత్రక గాథాలహరిలో కొన్ని ఎంపిక చేసిన ఘట్టాల గానం మీ వందిమాగధ బృందాలకు వీనుల విందు చేసింది. అయితే, మీ గానంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ఘనత అంతా మీకే చెందాలనే దురాశ వల్ల కొన్ని అసత్యాలు, అర్ధసత్యాలు చేర్చడంతో.. మీ గాథాలహరిని కనీసం పోలవరంపై ప్రేమతోనైనా ఆస్వాదించాలనుకొన్న మావంటివారికి అపశ్రుతులు వినిపించాయి.

అయితే పోలవరంపై ఇప్పటికైనా శాసనసభలో ఒక ప్రకటన చేసినందుకు ధన్యవాదాలు. పోలవరాన్ని పూర్తిచేయడమే మీ జీవితాశయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీరు ప్రకటించడం చాలామంది ఆంధ్ర ప్రజలతో పాటు నాకు ఆనందాన్ని కలిగించింది. అయితే ప్రభుత్వాధినేతగా, శాసనసభా నాయకుడిగా మీరు నిజాయతీగా పోలవరం విషయంలో వాస్తవాలను వెల్లడిస్తారని ఆశించిన మావంటి వారికి మీరు గట్టి షాక్ ఇచ్చి.. వేదిక ఏదైనా, అది పత్రికా సమావేశమైనా లేదా శాసనసభ అయినా మీది అసత్యాలు చెప్పడానికి వెనుకాడే మనస్తత్వం కాదని నిరూపించుకొన్నారు.

1981 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్య గారి కాబినెట్ లో మంత్రిగా ఉండి కూడా, అప్పట్లో పోలవరం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన అంజయ్య గారి పేరుని గానీ, 2004 -2014 ల మధ్య ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు సాధించి ప్రాజెక్ట్ టెండర్లు ఫైనలైజ్ చేసి, కాలువలు తవ్వకం దాదాపు పూర్తి చేయించిన వై.యస్.రాజశేఖర రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పేర్లు గానీ ప్రస్తావించకుండా..పోలవరం చరిత్ర పాఠాలు చెప్పిన మీ వంచనా చాతుర్యానికి.. మీ భజన బృందం బల్లదరువులతో జేజేలు పలికినా..సమకాలీన చరిత్రకు మసిపూయాలనుకొన్న మీ ప్రయత్నం సఫలం కాలేదు.

అయితే 1980-2014 ల మధ్య పోలవరం చరిత్రను చెప్పకుండా.. అలవోకగా పోలవరం చరిత్రను సింహావలోకనం చేసిన మీరు 1996 -2004 మధ్య మీ హయాంలో మీరు పోలవరానికి చేసినది ఏమీ లేదని చెప్పకనే చెప్పారు. పోలవరంపై మీరు శాసనసభలో చేసిన ప్రకటన వల్ల .. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై, నిధులపై ప్రజలలో ఉన్న గందరగోళం, అయోమయం ఇంకా పెరిగింది. పోలవరం నిర్మాణం మీ చేతులలోకి తీసుకోవడానికి మీరు కేంద్రంతో ఏమి ఒప్పందం చేసుకున్నారో తెలియదు.

కానీ విభజన చట్టానికి వ్యతిరేకంగా పోలవరం ఖర్చును 01.04.2014 అంచనాల ప్రకారం మాత్రమే భరిస్తామని కేంద్రం కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చినది. దీనివల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇది తెలిసీ, కారణాలు ఏవైనా మీరు కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలముందు ఉంచకపోతే.. మీ వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి పోలవరం నిధుల విషయంలో వాస్తవాలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెంటనే నివేదించవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించండి. లేదా మిమ్ములను నమ్ముకొని, ఎన్నుకొన్న ప్రజలకు తీరని నష్టం చేసిన వారు అవుతారు అని గ్రహించండి"

  • Loading...

More Telugu News