Chandrababu: పోలవరంపై కేంద్రం లేఖ రాసింది.. దీంతో గందరగోళం ఏర్పడింది!: కేంద్ర ప్రభుత్వ తీరుపై చంద్రబాబు అసహనం!
- కేంద్ర మంత్రితో మాట్లాడిన తర్వాతే పోలవరంకు టెండర్లు పిలిచాం
- నిన్న కేంద్రం రాసిన లేఖతో గందరగోళం నెలకొంది
- నియోజకవర్గాల పెంపు అంశాన్ని కూడా పెండింగ్ లో పెట్టింది
ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పోలవరం టెండర్ పై కేంద్ర ప్రభుత్వం నిన్న లేఖ రాసిందని అసెంబ్లీలో ఆయన తెలిపారు. పోలవరం అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే కొన్ని పనులను 60సీ కింద వేరే వాళ్లకు అప్పగించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర మంత్రితో మాట్లాడిన తర్వాతే టెండర్లను పిలిచామని... ఇప్పుడు కేంద్రం మళ్లీ లేఖ రాయడంతో గందరగోళం నెలకొందని చెప్పారు.
నియోజకవర్గాల పెంపు హామీ కూడా ఇంతవరకు నెరవేరలేదని మండిపడ్డారు. నియోజకవర్గాలను 225కు పెంచాల్సి ఉందని... అయితే, ఈ అంశాన్ని కేంద్రం పెండింగ్ లో పెట్టిందని అన్నారు. వివిధ పనుల కోసం భూములు అడిగితే వెంటనే కేటాయించామని... మంగళగిరిలో ఎయిమ్స్ కు భూములిచ్చామని, విమానాశ్రయాల అభివృద్ధికి భూములిచ్చామని చెప్పారు. సెంట్రల్, గిరిజన వర్శిటీలు కూడా రావాల్సి ఉందని అన్నారు.
విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ 62 సార్లు ఢిల్లీకి వెళ్లామని... అయినా ఫలితం లేకపోయిందని చంద్రబాబు అన్నారు. రెవెన్యూ లోటు నిధులను ఇస్తామని కూడా గతంలో కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 60 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అన్నారు. విశాఖలో మెట్రో రైలు కోసం పీపీపీ విధానంతో ముందుకెళతామని తెలిపారు. విజయవాడలో లైట్ మెట్రోకు మాత్రమే అవకాశముందని చెప్పారు.