Chandrababu: పోలవరం ఆపేయమంటే ఆపేస్తాం!: చంద్రబాబు సంచలన ప్రకటన
- పోలవరం పనుల పూర్తికి టెండర్లు పిలిచిన ఏపీ ప్రభుత్వం
- పనులు అప్పగించవద్దన్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి
- చంద్రబాబుకు లేఖ రాసిన ఉన్నతాధికారి
పోలవరం ప్రాజెక్టు ఆపేయమంటే ఆపేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే కొన్ని పనులను 60సీ కింద వేరే వాళ్లకు అప్పగించాల్సి ఉంటుందని, అందుకే తాము టెండర్లు పిలిచామని చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. ఈ విషయం కేంద్రప్రభుత్వానికి తెలుసని ఆయన అన్నారు. అయినా ఉన్నతాధికారి ఒకరు పోలవరం పనులను పూర్తి చేసేందుకు పిలిచిన టెండర్లు ఆపాలని లేఖ రాశారని, దీంతో పనులు అయోమయంలో పడిపోయాయని ఆయన అన్నారు.
ఈ దశలో పనులు ఆరు నెలలపాటు ఆగిపోతే పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయంలో పూర్తి చేస్తామంటూ ముందుకొచ్చి, పనులను హ్యాండోవర్ చేసుకుంటే పూర్తిగా సహకరిస్తామని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఇంకా 60 వేల ఎకరాల భూములు సేకరించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ దశలో పనులు ఇంకొకరికి అప్పగించవద్దని ఒక ఉన్నతాధికారి లేఖ రాయడంతో సమస్య ఉత్పన్నమైందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విదేశాల నుంచి భారత్ కు వచ్చిన వెంటనే ఆయనను సంప్రదిస్తామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటన ఏపీలో పెను కలకలం రేపుతోంది.