Ockhi: తెలుగు రాష్ట్రాలపై 'ఓఖీ' ప్రభావం... తమిళనాడు అతలాకుతలం... 8 మంది మృతి!
- బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుపాను
- ప్రస్తుతం అరేబియా సముద్రం మీదుగా లక్షద్వీప్ వైపు
- తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు
బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ తుపాను 'ఓఖీ' ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. దీంతో ఈ ఉదయం ఆకాశం మొత్తం మేఘావృతమైంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. 'ఓఖీ' ప్రభావం తమిళనాడుపై అత్యధికంగా ఉంది. ఇప్పటివరకూ 8 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తుపాను లక్షద్వీప్ వైపు వెళుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం బంగాళాఖాతాన్ని దాటి, అరేబియా సముద్రం వైపు వెళ్లిన తుపాను తిరువనంతపురానికి 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. పలు ప్రాంతాల్లో 500 వరకూ చెట్లు నేలకూలాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. పల్లపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన సుమారు 80 మంది జాలర్ల ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, చాలా చోట్ల రహదారులు దెబ్బతినడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.