Donald Trump: కిమ్ జాంగ్ తమకు మిత్రుడేనంటూ ట్రంప్ కు షాకిచ్చిన పుతిన్!
- ఉత్తర కొరియాను నిలువరించాలని ట్రంప్ ప్రయత్నాలు
- మరిన్ని ఆంక్షలకు అంగీకరించేది లేదన్న పుతిన్
- ఉత్తర కొరియాను మరింత రెచ్చగొట్టవద్దని సలహా
ఎలాగైనా ఉత్తర కొరియాను నిలువరించాలని అమెరికా చేస్తున్న విశ్వప్రయత్నాలకు అడ్డుపడుతూ, రష్యా మరో షాకిచ్చింది. ఉత్తర కొరియాతో సంబంధాలను తెంచుకోవాలని, ఆ దేశానికి ఆర్థిక, రాజకీయ సహకారాన్ని అందించవద్దని కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఫోన్ లో కోరిన వేళ, అందుకు అంగీకరించేది లేదని పుతిన్ స్పష్టం చేశారు.
రష్యా మీడియాలో వచ్చిన కథనాల మేరకు, ఉత్తర కొరియాతో తమ బంధాన్ని తెంచుకునేది లేదని, కిమ్ జాంగ్ తమకు మంచి మిత్రుడని పుతిన్ చెప్పారు. అమెరికా చర్యలు ఉత్తర కొరియాను మరింతగా రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పటికే ఆ దేశంపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయని, అంతకుమించిన ఆంక్షలు అవసరం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా, రెండు రోజుల క్రితం ఉత్తర కొరియా మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే.