BCCI: ధోనీ, కోహ్లీ రంగంలోకి దిగడంతో క్రికెటర్ల సమస్యకు శుభం కార్డు.. పెరగనున్న వేతనాలు!
- నెరవేరనున్న జీతాల పెంపు డిమాండ్
- ధోనీ, కోహ్లీ, శాస్త్రిలతో చర్చించిన పాలకుల కమిటీ
- పలు అంశాలపై సుదీర్ఘ చర్చ
- వేతన పెంపునకు అంగీకరించామన్న వినోద్ రాయ్
భారత క్రికెటర్ల ప్రధాన డిమాండ్ నెరవేరే సమయం ఆసన్నమైంది. తమకు వేతనాలు పెంచాలని క్రికెటర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తుండగా, వారి తరఫున కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రిల బృందం బీసీసీఐ పాలకుల కమిటీతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, మెంబర్స్ డయానా ఎడుల్జి, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిలు సమావేశమై, వేతనాల పెంపు సహా, మ్యాచ్ ల షెడ్యూల్స్, కుదింపు, విదేశీ పర్యటనలు తదితర ఎన్నో అంశాలను చర్చించారు.
జీతాల పెంపుపై ఓ అవగాహనకు వచ్చామని సమావేశం అనంతరం వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల ప్యాకేజీలు పెంచాలని నిర్ణయించామని, ఏ మేరకు చెల్లింపులు ఉండాలన్న విషయమై మాత్రం నిర్ణయించలేదని అన్నారు. కాగా, ప్రస్తుతం బీసీసీఐ నుంచి ఏడాదికి గ్రేడ్-ఎ ఆటగాడికి రూ. 2 కోట్లు, గ్రేడ్-బి ఆటగాడికి రూ. కోటి, గ్రేడ్-సి ఆటగాడికి రూ. 50 లక్షలు అందుతోంది. దీన్ని రూ. 5 కోట్ల వరకూ పెంచాలన్నది క్రికెటర్ల డిమాండ్. ముఖ్యంగా పుజారా వంటి టెస్టు క్రికెట్ కు పరిమితమైన నైపుణ్యవంతులైన ఆటగాళ్లు వేతనాల విషయంలో నష్టపోకుండా చూడాలన్నది ధోనీ, కోహ్లీల డిమాండ్ కాగా, అందుకు సీఓఏ నుంచి సానుకూల స్పందనే వచ్చింది.