sourav ganguly: కుంబ్లే కోసం అప్పుడు చిన్నపాటి యుద్ధమే చేశా: గంగూలీ
- ఆసీస్ టూర్ కు కుంబ్లేను పక్కన పెట్టాలనుకున్న సెలెక్టర్లు
- కుంబ్లే ఉండాల్సిందే అన్న దాదా
- ఆ సిరీస్ లో అదరగొట్టిన కుంబ్లే
2003-04 ఆస్ట్రేలియా టూర్ కు టీమ్ ను ఎంపిక చేసే సమయంలో కెప్టెన్ గా ఉన్న తాను సెలెక్టర్లతో చిన్నపాటి యుద్ధమే చేశానని గంగూలీ తెలిపాడు. అనిల్ కుంబ్లేను పక్కన పెట్టాలని సెలక్టర్లు భావించారని... వారి నిర్ణయాన్ని తాను తోసిపుచ్చానని చెప్పాడు. జట్టులో కుంబ్లే ఉండాల్సిందేనని తాను పట్టుబట్టానని అన్నాడు. కుంబ్లే ఓ మ్యాచ్ విన్నర్ అని... ఇండియన్ క్రికెట్ కోసం ఆయన ఎంతో చేశాడని... ఆస్ట్రేలియా టూర్ లో కుంబ్లే ఉండాల్సిందేనని సెలెక్టర్లను కోరానని చెప్పాడు.
లెఫ్ట్ హ్యండ్ స్పిన్నర్లను ఆస్ట్రేలియన్లు బాగా ఆడలేరని... ఈ కారణంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను తీసుకోవాలనేది సెలక్టర్ల ఆలోచన అని గంగూలీ చెప్పాడు. దాదాపు రెండు గంటల పాటు వాగ్వాదం నడిచిందని... కోచ్ జాన్ రైట్ తన వద్దకు వచ్చి, ఇంతటితో దీన్ని వదిలేయాలని చెప్పాడని... సెలెక్టర్లు ఇచ్చిన టీమ్ తో వెళదామని అన్నాడని చెప్పాడు.
దీనికి సమాధానంగా 'కుంబ్లేను ఇప్పుడు పక్కన పెడితే, అతను ఇకపై ఇండియాకు ఆడకపోవచ్చు' అని చెప్పానని తెలిపాడు. గత పదేళ్లుగా కుంబ్లే ఓ ఛాంపియన్ అని... ప్రస్తుతం కొంచెం ఫామ్ మాత్రమే తగ్గిందని... ఇది టెంపరరీ మాత్రమే అని చెప్పానని పేర్కొన్నాడు.
జట్టులో కుంబ్లేను తీసుకోనంత వరకు సెలక్షన్ షీట్ పై తాను సంతకం చేయబోనని స్పష్టం చేశానని గంగూలీ తెలిపాడు. దీంతో సెలెక్టర్లు అసహనానికి గురయ్యారని... కుంబ్లే సరిగా ఆడలేకపోయినా, నీవు సరిగా ఆడలేకపోయినా, టీమ్ సరైన ప్రదర్శన చేయలేకపోయినా అందరికన్నా ముందు నువ్వే పోవాల్సి ఉంటుందని తనను హెచ్చరించారని... దానికి తాను సరే అన్నానని చెప్పాడు. రిస్క్ తీసుకోవడానికి తాను రెడీ అని చెప్పానని తెలిపాడు.
ఆ తర్వాత ఆ సిరీస్ లో కుంబ్లే అద్భుతంగా రాణించాడని, ఆ సంవత్సరం అంతా ఔట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ చేశాడని చెప్పాడు. ఆ ఏడాది కుంబ్లే ఏకంగా 80 వికెట్లు పడగొట్టాడని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఏ స్పిన్నర్ కూడా అన్ని వికెట్లు తీయలేదని తెలిపాడు.