america: ఉత్తరకొరియా పేట్రేగిపోతోంది... దాని పీచమణచాలి.. సాయం చెయ్యరూ?: భారత్ ను కోరిన అమెరికా
- ఉత్తరకొరియాపై భారత్ ఒత్తిడి తేవాలన్న అమెరికా
- మిత్రదేశాలు కలిసిరావాలన్న అగ్రరాజ్యం
- భారత్ తో మాకు చక్కని అనుబంధం ఉంది
- చైనాపై నమ్మకం ఉంది.. ఒత్తిడి తెస్తుంది
‘ప్రపంచ ముప్పు’గా పరిణమించిన ఉత్తరకొరియాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ సాయం చేయాలని అగ్రరాజ్యం అమెరికా కోరింది. ప్యాంగ్యాంగ్ (ఉ.కొరియా) ఖండాంతర అణు క్షిపణి ప్రయోగాలు చేపట్టకుండా అడ్డుకట్ట వేసేందుకు మిత్రదేశాలు కలిసి రావాలని అమెరికా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా అధికార ప్రతినిధి హేథర్ నౌవర్ట్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీతో తమకు చక్కని అనుబంధం ఉందని అన్నారు. ఈ అంశంపై భారత్ మరింత సాయం చేయగలదని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
చైనా, రష్యాలకు ఉత్తర కొరియాతో ప్రత్యేక ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, ఆ రెండు దేశాలతో ఉన్న సంబంధాలను కూడా ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు. చైనాతో ఈ విషయంపై ఇప్పటికే నాలుగు సార్లు చర్చించామని ఆయన చెప్పారు. ఉత్తరకొరియాతో ఉన్న ఆర్థిక సంబంధాలను ప్యాంగ్యాంగ్ పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా ఉపయోగించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.
ఉత్తర కొరియాపై చాలా దేశాలు ఒత్తిడి చేయగలిగినప్పటికీ, చైనాపై తమకు ఎక్కువ నమ్మకం ఉందని ఆయన తెలిపారు. రష్యా, చైనాల సమక్షంలోనే ప్యాంగ్యాంగ్ పై ఐక్యరాజ్యసమితిలో ఆంక్షలు విధించామని ఆయన తెలిపారు. ఉత్తరకొరియాపై 20 కంటే ఎక్కువ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయని ఆయన తెలిపారు. కాగా, అమెరికా ఆదేశాల మేరకు వివిధ దేశాలు తమ రాయబారులను వెనక్కి రప్పించుకోగా, భారత్ మాత్రం తన రాయబార కార్యాలయాన్ని, అధికారులను అక్కడ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే!