kapu reservation: కాపులు ఇకపై బీసీ (ఎఫ్)... మంజునాథ కమిషన్ సూచన!
- కాపులను బీసీ (ఎఫ్)గా పరిగణించనున్న ఏపీ
- 4 నుంచి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చని మంజునాథ కమీషన్ సూచన
- 5 శాతానికే మొగ్గు చూపిన ఏపీ కేబినెట్
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాపు, కాపు ఉపకులాలైన బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించినట్టు వార్తలు వస్తున్నాయి. కాపు రిజర్వేషన్ పై వేసిన మంజునాథ కమీషన్ కాపులకు నాలుగు లేదా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చని సూచన చేసినట్టు తెలుస్తోంది. అయితే కేబినెట్ మాత్రం 5 శాతానికి మొగ్గు చూపింది.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీ మంత్రులను సూచనలు కోరడంతో, దీనిపై వారేమీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో, కాపు రిజర్వేషన్ కు ఆమోదం లభించిందని, కమీషన్ సూచించిన విధంగా కాపులను బీసీ (ఎఫ్)గా పేర్కొననున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బీసీల్లో ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బీసీల్లో కాపులను ఎఫ్ కేటగిరీలో చేరుస్తారు. ఇక బోయలను ఎస్టీలుగా గుర్తించాలన్న డిమాండ్ కు కూడా సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.