onion: ధరలకు రెక్కలు.. భారత్ నుంచి తగ్గిపోయిన ఎగుమతి.. ఉల్లి కోసం ఆసియా విలవిల!
- దిగుబడి తగ్గడంతో భారత్లో పెరిగిన ధరలు
- ఎగుమతులపై భారత్ పరిమితులు
- ముఖ్యంగా బంగ్లాదేశ్, మలేసియా, యూఏఈ దేశాల్లో ఉల్లికరవు
- రాబోయే రెండు నెలల్లో ఉల్లిపై భారత్ పరిమితులు
భారత్లో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. ఉల్లి అత్యధికంగా సాగు అయ్యే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి అధిక వర్షాల కారణంగా దిగుబడి పడిపోవడంతో ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. దీంతో భారత్ ఎగుమతులపై పరిమితులు విధించింది. దీనికి తోడు ప్రపంచ మార్కెట్లో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో మన దేశం నుంచి ఉల్లిని అధికంగా దిగుమతి చేసుకునే ఆసియా దేశాల్లో ఉల్లి కరవైపోయింది.
ప్రధానంగా బంగ్లాదేశ్, మలేసియా, యూఏఈ ఉల్లి కోసం అల్లాడిపోతున్నాయి. రాబోయే రెండు నెలల్లో ఉల్లిపై భారత్ పరిమితులు ఎత్తివేస్తుందని ఆయా దేశాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. గత ఏడాది భారత్, పాక్లో ఉల్లి అధికంగా పండడంతో నష్టం వచ్చింది. ఈ ఏడాది ఉల్లి తక్కువగా పండడంతో డిమాండ్ పెరిగిపోయింది. అప్పటితో పోలిస్తే ఉల్లి ధర 7 రెట్లు అధికంగా ఉంది. ఉల్లిని అధికంగా భారత్, పాకిస్థాన్, చైనా, ఈజిప్టు దేశాలు ఎగుమతి చేస్తుంటాయి. భారత్ నుంచి ఉల్లి తక్కువగా ఎగుమతి అవుతుండడంతో ఆసియా దేశాల్లో ధరలకు రెక్కలొచ్చాయి. మన దేశంలో ఉల్లి ధర కేజీకి రూ.80 రూపాయలు పలుకుతోన్న విషయం తెలిసిందే.