barack obama: ట్వీట్ చేసే ముందు ఆలోచించండి... పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్‌కి సూచన ఇచ్చిన ఒబామా!
- సోషల్ మీడియా నిర్వహణ గురించి ఒబామా సలహాలు
- సమాజానికి ప్రతిబింబమే రాజకీయ నాయకుడని వ్యాఖ్య
- న్యూఢిల్లీ సదస్సులో ప్రసంగించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ట్విట్టర్ వాడకం గురించి పరోక్షంగా కొన్ని సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఒబామా న్యూఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఖాతాలో నిర్వహణ గురించి కొన్ని సూచనలు ఇచ్చారు.
'మాట్లాడటానికి ముందు ఆలోచించండి అనే సూక్తి... ట్విట్టర్‌కి కూడా వర్తిస్తుంది. అందుకే ట్వీట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. చూడండి.. నాకు దాదాపు 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య రోజూ ట్వీట్ వాడే కొంతమంది కంటే ఎక్కువ' అని ఒబామా అన్నారు. ఈ మాటల్లో పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్‌ను ఒబామా ప్రస్తావించినట్లు అనిపిస్తుంది. ట్రంప్ ట్విట్టర్లో చాలా క్రియాశీలకంగా ఉంటారు. ఆయన ఫాలోవర్లు 43.8 మిలియన్ల మంది మాత్రమే. అంతేకాకుండా అతని ట్వీట్లలో అచ్చుతప్పులు, వివాదాలు ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.