KE Krishnamurthy: అసెంబ్లీలో ప్రశ్నలడుగుతుంటే శివాలెత్తిన కేఈ కృష్ణమూర్తి!
- సొంత మంత్రులనే ఇరుకున పెట్టిన ఎమ్మెల్యేలు
- భూ రికార్డుల ట్యాంపరింగ్ పై అధికార ఎమ్మెల్యేల నుంచి ఆరోపణలు
- కేఈ కృష్ణమూర్తి సమాధానంపై అసంతృప్తి
- ఆగ్రహంతో ఊగిపోయిన డిప్యూటీ సీఎం
ప్రతిపక్షం లేకుండా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ, మంత్రులను ఇరుకునపెట్టారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు జరిగిన సమావేశాలుగా ప్రస్తుత శీతాకాల సమావేశాలు నిలువగా, పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లో సమస్యలపై మంత్రులను నిలదీశారు.
ఇక భూ రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని వచ్చిన ప్రశ్నపై ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పిన సమాధానంపై కొందరు సభ్యులు సభలోనే అసంతృప్తిని వ్యక్తం చేసిన వేళ, ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అటువంటిది ఏమైనా తమ దృష్టికి వచ్చినా చూస్తూ ఊరుకున్నట్టు సభ్యులు వాదించడం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై, ఫెర్రీ ఘాట్ బోటు ప్రమాదంపై ప్రభుత్వ లోపాలను సభ్యులు ఎత్తి చూపారు. ఈ సమావేశాలు మొత్తం 12 రోజుల పాటు సాగగా, కాపులను బీసీల్లో చేర్చడం సహా కీలకమైన 16 బిల్లులను ఆమోదించారు. మండలిలోనూ అధికార పార్టీ సభ్యులు, మంత్రి కామినేని మధ్య మాటల యుద్ధం నడిచింది.