Hyderabad: మెట్రోలో ‘వీకెండ్’.. పోటెత్తిన ప్రయాణికులు.. కిక్కిరిసిన రైలు పెట్టెలు!
- నగరవాసుల్లో వీకెండ్ జోష్
- తిరునాళ్లలా మారిన మెట్రో రైలు స్టేషన్లు
- బోసిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు
మెట్రో రైలు ప్రారంభం అయ్యాక వచ్చిన తొలి వీకెండ్ హెచ్ఎంఆర్కు కాసుల వర్షం కురిపించింది. సెలవు రోజున ఎంజాయ్ చేసేందుకు బయటకు వచ్చిన నగరవాసులు మెట్రో జర్నీ కోసం ఎగబడ్డారు. ఫలితంగా మెట్రో రైలు స్టేషన్లు తిరునాళ్లను తలపించాయి. ప్రయాణికుల జోరుతో స్టేషన్లు జనసంద్రంగా మారాయి. రోజుకు రూ. 1.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో రైళ్లు శనివారం ఏకంగా 2.10 లక్షల మందికి ప్రయాణ అనుభవాన్ని పంచాయి. ఆదివారం ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
శనివారం సెలవు దినం కావడంతో అందివచ్చిన అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకున్నారు. పిల్లాపెద్దలతో తరలివచ్చి మెట్రోలో ప్రయాణించాలన్న కోరికను నెరవేర్చుకున్నారు. ఫలితంగా టికెట్ కౌంటర్లు, వెండింగ్ మిషన్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపించాయి. ముఖ్యంగా నాగోలు, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, మియాపూర్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది.
ఈ క్రమంలో మెట్రో అందుబాటులోకి రాకముందు వరకు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉండే ఎంఎంటీఎస్ రైళ్లు శనివారం బోసిపోయాయి. ఎప్పుడు చూసినా ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు ప్రయాణికులతో ప్యాక్ అయి ఉండే ఎంఎంటీఎస్ రైళ్లు శనివారం మామూలుగా నడిచాయి. చాలామంది మెట్రోను ఆశ్రయించడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఎంఎంటీఎస్ రైళ్లు రోజుకు 121 సర్వీసులతో సగటున 1.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. మెట్రో కారణంగా శనివారం ఈ సంఖ్య బాగా తగ్గిందని రైల్వే అధికారులు తెలిపారు.