Indian Army: యుద్ధం లేకున్నా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న భారత జవాన్లు!
- ఏడాదికి 1600 మంది మృత్యువాత
- రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వైనం
- వెల్లడవుతున్న విస్తుగొలిపే నిజాలు
యుద్ధాల్లో సైనికులు చనిపోవడం సహజం. కానీ ఎటువంటి యుద్ధం లేకుండానే భారత సైన్యం ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోతోంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతలో కంటే రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల ద్వారా ఎక్కువమంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. సగటున ఏడాదికి 1600 మంది సైనికులను ఆర్మీ కోల్పోతున్నట్టు వెల్లడైంది.
ఒక్క రోడ్డు ప్రమాదాల ద్వారానే ఏడాదికి 350 మంది సైనికులు, నావికులు, ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోతుండగా, 120 మంది ఆత్మహత్యల ద్వారా దూరమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా మరింత ఎక్కువ మంది మరణిస్తున్నారు. వివిధ రకాల ఆరోగ్య కారణాల వల్ల మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక క్షతగాత్రులవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.
ఆర్మీ, నేవీ, భారత వాయుసేనలు గత మూడేళ్లలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 6,500 మందిని కోల్పోయాయి. వీరిలో ఎక్కువమంది ఆర్మీకి చెందిన వారు కాగా ఆ తర్వాతి స్థానంలో వాయుసేన, నేవీ ఉన్నాయి.