Super Moon: సూపర్ మూన్... రేపు వినువీధిలో కనువిందు!
- మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్న చందమామ
- సాధారణంతో పోలిస్తే 14 శాతం పెద్దగా కనిపించే చంద్రుడు
- టెలిస్కోపులు, బైనాక్యులర్లు వాడితే మరింత అందం
రేపు వినువీధిలో సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి వెండి వెన్నెల వెలుగులు మరింతగా ప్రకాశించనున్నాయి. భూమికి అతి దగ్గరగా చంద్రుడు రానుండటంతో, సాధారణంగా కనిపించే పరిమాణంతో పోలిస్తే, 14 శాతం ఎక్కువగా, 30 శాతం వెలుగులను విరజిమ్మనున్నాడు. సాధారణంగా ఈ సూపర్ మూన్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.
కానీ, రేపటి పౌర్ణమి నాడు, మబ్బులు పట్టి ఉండని ఏ ప్రాంతం నుంచైనా దీన్ని చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సంవత్సరం సూపర్ మూన్ కు 'కోల్డ్ మూన్' అని నామకరణం చేయగా, అరుదుగా కనిపించే ఇలాంటి అద్భుతాన్ని చూసేందుకు ఔత్సాహికులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ చంద్రుడిని మరింత స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్లు, టెలిస్కోపులు వాడాలని సూచిస్తున్నారు. కాగా, గత సంవత్సరం నవంబర్ 16వ తేదీన కూడా సూపర్ మూన్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.