gurnathreddy: నాపై ఆరోపణలున్నాయి కానీ ఇంత వరకు ఒక్క కేసు కూడా లేదు: మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి
- ప్రజా సమస్యలపై జగన్ కు చిత్తశుద్ధి లేదు
- చంద్రబాబు పనితీరు చూసి పార్టీ మారాను
- పరిటాల రవితో మంచి సంబంధాలు ఉండేవి
రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ సముఖంగా లేరంటే.. ప్రజా సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని అర్థమయ్యే పార్టీ మారానని అనంతపురం పట్టణ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తెలిపారు. తాను హత్యారాజకీయాలు చేశానని ఆరోపణలు ఉన్నాయని, అయితే తనపై ఎలాంటి కేసు లేదని ఆయన చెప్పారు. ప్రభాకర్ చౌదరి ఎక్కడ కనిపించినా 'అన్నా బాగున్నారా?' అని అడుగుతానని ఆయన అన్నారు.
'మిస్సమ్మ భూములు' సౌత్ ఇండియన్ చర్చ్ కు సంబంధించినవని ఆయన తెలిపారు. 'అందులో ఏదైనా సమస్య ఉంటే రెవెన్యూ విభాగం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వదు కదా?' అని ఆయన ప్రశ్నించారు. బీటెక్ రవి తనకు స్నేహితుడే కానీ.. భారీ మొత్తంలో డబ్బులిచ్చేంత సాన్నిహిత్యం లేదని ఆయన చెప్పారు. తాను శాంతికాముకుడ్నని ఆయన అన్నారు. అలా ఉండడం వల్లే అనంతపురం అర్బన్ లో ఐదు సార్లు గెలవగలిగామని ఆయన చెప్పారు.
సీఎం చంద్రబాబు పని తీరుపై నమ్మకంతోనే తాను పార్టీ మారానని ఆయన తెలిపారు. పరిటాల రవితో తనకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవని ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే పరిటాల కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తమ కుటుంబం కాంట్రాక్టులు చేసినప్పటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు.