jagan: 'అన్నా.. ఇదన్నా మా పరిస్థితి' అని గుత్తి ప్రజలు తమ బాధలు చెప్పారు: జగన్
- కర్నూలులో ముగిసిన జగన్ పాదయాత్ర
- అనంతపురంలోని గుత్తిటౌన్లో అడుగుపెట్టిన జగన్
- గుత్తి మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు
- అందరి కష్టాలను తెలుసుకున్నాను
'మనకు ఎలాంటి నాయకుడు కావాలి? మోసం చేసేవారు నాయకుడిగా కావాలా? అసత్యాలు చెప్పేనాయకుడు కావాలా?' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలులో పాదయాత్రను ముగించుకున్న జగన్... ఈ రోజు అనంతపురంలోని గుత్తి టౌన్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు జగన్కు తమ బాధలను వివరించి చెప్పారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... "నాలుగేళ్ల చంద్రబాబు నాయుడి పాలన చూశాం. ఎన్నో అసత్యాలు చెప్పుకుంటున్నారు. గుత్తి మోడల్ స్కూల్ నుంచి టీచర్లు వచ్చారు... ఆ స్కూల్లో పరిస్థితి ఏంటో తెలుసా? దాదాపు ఆరు నెలల నుంచి టీచర్లకు జీతాలు లేవు. వారు చదువు ఎలా చెబుతారన్న జ్ఞానం కూడా చంద్రబాబుకి లేదు.
గుత్తి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు నా వద్దకు వచ్చారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని అన్నారు. ఇదే గుత్తిలో ఉర్దూ స్కూల్ ఉంది.. మీ అందరికీ తెలుసు.. పిల్లలకు అన్నం వండే ఆయాలు వచ్చారు.. ఆరు నెలల నుంచి అన్నం వండుతున్నా తమకు డబ్బులు ఇవ్వట్లేదని అన్నారు. తమకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెబుతున్నారు. అప్పట్లో 108 కుయ్, కుయ్, కుయ్ అంటూ వచ్చేది. ప్రియతమ నాయకుడు వైఎస్సార్ ఆ సౌకర్యాన్ని కల్పించారు.
తమకు రెండు నెలల నుంచి జీతాలు లేవని 108 వారు చెబుతున్నారు. జెడ్పీ హై స్కూల్ లో బాత్రూమ్లు లేవని నాకు పిల్లలు చెప్పారు. మీ కష్టాలన్నింటినీ తెలుసుకున్నాను.. పాలనలో విచ్చలవిడి అవినీతి కనపడుతోంది. రాష్ట్రంలో దొంగల రాజ్యం ఉంది. గ్రామాల్లో రేషన్ బియ్యం కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అన్నా.. ఇదన్నా మా పరిస్థితి.. అని గుత్తి ప్రజలు బాధలు చెప్పారు. ఒక్కసారి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో గుర్తు తెచ్చుకోండి.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పండి" అని వ్యాఖ్యానించారు.