Jayalalitha: ‘అమ్మ’ లేకుండా ఏడాది.. తమిళనాడు రాష్ట్రంలో అయోమయం!

  • జయలలిత మరణించి నేటికి ఏడాది
  • నేటికీ కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి
  • జయ సమాధి చుట్టూ తిరుగుతున్న రాజకీయం

డిసెంబరు 5.. తమిళ ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించిన రోజు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన రోజు. తమిళుల ఆరాధ్య దైవం జయలలిత కన్నుమూసి నేటికి సరిగ్గా ఏడాది. సంవత్సరం గడుస్తున్నా రాష్ట్రంలో ‘అమ్మ’ లేని లోటు అలాగే ఉంది. ఆమె మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి చోటుచేసుకుంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

అప్పటి వరకు జయ చాటున ఉన్న శశికళ ఆమె మరణంతో జూలు విదిల్చారు. పార్టీపై పట్టు బిగించేందుకు ప్రయత్నించారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయ్యారు. ముఖ్యమంత్రిగా జయలలిత నియమించిన పన్నీర్ సెల్వానికి వ్యతిరేకంగా పళనిస్వామి వర్గాన్ని తెరపైకి తెచ్చారు. చివరికి ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇక తాను సీఎంను కావడమే తరువాయి అనుకున్న సమయంలో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెంగళూరులోని  పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.  
 
జయ సీఎంగా ఉన్నన్నాళ్లూ ఉన్నామా, లేమా అన్నట్టుగా ఉన్న ఐటీ శాఖ ఒక్కసారిగా జూలు విదిల్చింది. వీఐపీలు సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసంలోనే సోదాలు చేపట్టింది. తమిళనాడు రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఐటీ శాఖ సచివాలయంలో దాడులు నిర్వహించడం అదే తొలిసారి.

జయలలిత బతికి ఉండగా తాము జయలలిత వారసులమని ఒక్కరు కూడా బయటకు రాని వారు ఆమె మరణంతో కలుగులోని ఎలుకల్లా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఆమెకు అసలైన వారసులం తామేనని ప్రకటించి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇప్పుడు బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల తాను జయ కుమార్తెనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం సూచన మేరకు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు.
 
‘చిన్నమ్మ’ రంగ ప్రవేశం తర్వాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గంగా విడిపోయింది. అయితే శశికళ జైలుకెళ్లిన తర్వాత పన్నీర్, పళని వర్గాలు కలిసిపోయాయి. ప్రస్తుతం పన్నీర్ వర్గమే అన్నాడీఎంకే పార్టీని నడుపుతోంది. ఇక, అనిశ్చితి రాజ్యమేలుతున్న తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు అటు బీజేపీ, ఇటు డీఎంకేలు పావులు కదుపుతున్నాయి.

‘ అమ్మ’ మరణం తర్వాత పొయెస్ గార్డెన్‌లో ఆమె నివసించిన ‘వేద నిలయం’ నేతలకు ఆలయంగా మారింది. ఏడాది తర్వాత ఇప్పుడది అనాథలా మారింది. దానిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇప్పుడు తమిళ రాజకీయాలు మొత్తం జయ సమాధి చుట్టూ తిరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News