Kingfisher: బ్యాంకుల డబ్బును విజయ్ మాల్యా ఎలా ఖర్చు పెట్టాడంటే..!

  • కింగ్ ఫిషర్ అభివృద్ధి పేరిట రుణాలు
  • ఆ డబ్బుతో ప్రైవేటు జెట్ లు, లగ్జరీ
  • విదేశాల్లో ఆస్తుల కొనుగోలు
  • కోర్టుకు తెలిపిన ప్రాసిక్యూషన్

ఇండియాలో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా టోకరా వేసి, లండన్ పారిపోయి, ప్రస్తుతం కోర్టు ముందు అప్పగింత కేసుకు హాజరవుతున్న మాల్యా, ఆ డబ్బును ఎందుకు తీసుకుని, ఎలా ఖర్చు పెట్టాడన్న విషయాన్ని సీబీఐ, ఈడీ అధికారులు సవివరంగా వెస్ట్ మినిస్టర్ కోర్టుకు వెల్లడిస్తున్నారు. ఈ కేసు విచారణ వరుసగా ఎనిమిది రోజులు సాగనుండగా, మాల్యా అప్పగింతపై తీర్పు ఎప్పుడు ఇచ్చే విషయం 14వ తేదీ వెల్లడి కానుంది.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అభివృద్ధి, మరిన్ని విమానాల కొనుగోలు, నూతన సర్వీసుల పేరు చెప్పి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, రుణాలిచ్చిన బ్యాంకుల్లో లండన్ లోని హెచ్ఎస్బీసీ కూడా ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ డబ్బుతో రెండు ప్రైవేటు కార్పొరేట్ జెట్ విమానాలకు కోట్ల రూపాయలు అద్దె కట్టాడని, వాటిని తన వ్యక్తిగత లగ్జరీలకు వాడుకున్నాడని ఆరోపించింది.

ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం, విదేశాల్లో ఆస్తులు కొనడం, ఫార్ములా వన్ రేసులు, క్రికెట్ మ్యాచ్ లకు బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును వాడాడని, ఫలితంగా కింగ్ ఫిషర్ దివాలా తీసి మూత పడిందని ఆరోపించింది. ఉత్తర లండన్ పరిధిలోని తేవిన్ గ్రామంలో ఫార్ములా వన్ రేసర్ లూయిస్ హామిల్టన్ నుంచి మాల్యా ఓ ఇంటిని కొనుగోలు చేశాడని గుర్తు చేసింది.

రుణాలు తిరిగి చెల్లించాలని బ్యాంకులు డిమాండ్ చేస్తే, పదేపదే వాయిదాలు వేస్తూ వచ్చిన ఆయన, ఒక్క రూపాయి కూడా కట్టలేదని, లండన్ కు పారిపోయి వచ్చాడని చూపుతూ, కొన్ని ఈ-మెయిల్స్ ను సీబీఐ, ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ కోర్టు ముందుంచింది. తన కంపెనీలకు భారీ లాభాలు వస్తున్నాయని చెబుతూ, మాల్యా ఐడీబీఐ బ్యాంకుకు పంపిన ఈమెయిల్ ను సైతం ప్రాసిక్యూషన్ చూపించింది. తాను రుణాలను తిరిగి ఎలా చెల్లించలగనన్న విషయాలపై మాల్యా రాసిన మెయిల్స్ నూ కోర్టు ముందుంచింది.

  • Loading...

More Telugu News