begging: ఇవాంక కోసం అరెస్ట్... వెళ్లగానే విడుదల... మళ్లీ రోడ్లపై బిచ్చగాళ్లు!
- జీఈఎస్ కు ముందు యాచకుల అరెస్ట్
- సదస్సు ముగియగానే వదిలేసిన జైలు అధికారులు
- తిరిగి రోడ్లపై అడుక్కుంటున్న యాచకులు
హైదరాబాద్ నగర రోడ్లపై బిచ్చగాళ్లు మళ్లీ ప్రత్యక్షమయ్యారు. గత వారం జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు ముందు రోడ్లపై బిచ్చగాళ్లు కనిపించకుండా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో, యాచకులనందరినీ అరెస్ట్ చేసి జైళ్లకు తరలించిన వందలాది మంది బిచ్చగాళ్లను ఇప్పుడు బయటకు వదిలేస్తున్నారు. దీంతో నగర కూడళ్లలో తిరిగి వారి సందడి మొదలైంది. వాళ్లకు పునరావాసం కల్పిస్తామన్న మాటను అధికారులు నిలబెట్టుకోలేకపోయారు.
చర్లపల్లి జైలు నుంచి, చంచల్ గూడ జైలు నుంచి యాచకులను వదిలేశామని జైలు అధికారులు వెల్లడించారు. వారు మళ్లీ యాచక వృత్తిలోకి అడుగు పెట్టకుండా, పెట్రోలు బంక్ లు, స్టోర్లలో ఉద్యోగాలు చేసే అవకాశాలు అందిస్తామని చర్లపల్లి ఒపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ అర్జునరావు వెల్లడించినా, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. హైదరాబాద్ రోడ్లపై తిరిగి బిచ్చగాళ్లు కనిపిస్తుండటంతో వారిని పట్టుకునేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులు చెబుతుండటం గమనార్హం.