ncrb: ఎన్సీఆర్బీ నివేదికలో తప్పిదం... ప్రకటన జారీ చేసిన హర్యానా పోలీసు శాఖ
- పోలీసులపై కేసుల్లో హర్యానా మొదటి స్థానమన్న ఎన్సీఆర్బీ
- లెక్కల్లో తప్పిదం జరిగిందన్న పోలీసు శాఖ
- సరిచేయాలని కోరిన హర్యానా డీజీపీ
ఇటీవల జాతీయ నేరాల నమోదు శాఖ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన 2016 నేరాల నివేదికలో తప్పులు ఉన్నాయని హర్యానా పోలీసు శాఖ ఆరోపించింది. పోలీసులపై నమోదైన కేసుల్లో హర్యానా మొదటి స్థానంలో ఉందంటూ ఎన్సీఆర్బీ వెల్లడించడంపై హర్యానా డీజీపీ బీఎస్ సాంధూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర నేరాల నమోదు శాఖ (ఎస్సీఆర్బీ)కు నివేదిక పంపేటపుడు గుర్గావ్ పోలీసులు చేసిన తప్పిదం వల్ల ఇలా జరిగిందని, వారు తప్పుడు కేసుల సంఖ్యల స్థానంలో పంపించాల్సిన 454 నెంబర్ను, పోలీసులపై నమోదైన కేసుల స్థానంలో వేయడంతో ఈ గందరగోళం జరిగిందని, నిజానికి గుర్గావ్ పరిధిలో పోలీసులపై కేసులు నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్సీఆర్బీని సరిచేయాలని కోరుతున్నట్లు తెలిపారు. హర్యానాలో 488 కేసులు పోలీసులపై నమోదైనట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. అయితే ఇక్కడ వాటి సంఖ్య 34 మాత్రమేనని సాంధూ అన్నారు.