solar power: సోలార్ విద్యుత్ తయారీ రంగంలోకి ప్రవేశించనున్న పతంజలి
- వెల్లడించిన ఎండీ ఆచార్య బాలకృష్ణ
- వ్యవస్థాపనా రంగంలో పతంజలి వారి మొదటి ప్రయత్నం
- 30 శాతం మూలధన సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం
యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ త్వరలో సోలార్ విద్యుత్ తయారీ రంగంలోకి ప్రవేశించనుంది. అందుకు సంబంధించిన పరికరాలు తయారుచేసి, అమ్మనుంది. 'సోలార్ రంగంలోకి రావడం స్వదేశీ ఉద్యమంలో భాగం. దీని ద్వారా దేశంలో ప్రతి ఇంట వెలుగులు నింపే అవకాశం కలుగుతుంది. ఆ కలను సాకారం చేసేందుకు మేం కృషి చేస్తాం' అని పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
వ్యవస్థాపనా రంగంలో పతంజలి వారు ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు వినియోగదారుల సరుకుల రంగంలో ఎదురులేకుండా పతంజలి లిమిటెడ్ నడుస్తోంది. సోలార్ తయారీ ప్లాంట్లు పెట్టడానికి సౌర విద్యుత్ పాలసీలో భాగంగా ప్రభుత్వం తరఫు నుంచి 30 శాతం సబ్సిడీ కూడా లభించనుంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకుని చైనా కంపెనీల్లా కాకుండా నాణ్యమైన సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేస్తామని బాలకృష్ణ అన్నారు.