eb-5 visa: ఈబీ-5 వీసా నిబంధనల్లోనూ మార్పులు ఉండవచ్చు: కెనామ్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో
- డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వీసాల జారీపై కఠిన ఆంక్షలు
- అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఈబీ-5 వీసా
- వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది
- ఈబీ-5 వీసాల జారీపై మాత్రం సానుకూలంగా అమెరికా
అమెరికాలో స్థిరపడాలనుకునే వారు ఈబీ-5 వీసా కోసం ప్రయత్నాలు జరుపుతుంటారు. ఈ వీసాను పొందాలనుకుంటోన్న వారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. దీని గురించి సమగ్ర సమాచారం ఇచ్చారు కెనామ్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో జెఫ్ డెసికో. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఈబీ-5 వీసాను పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు వీసాల జారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు.
వలస విధానానికి సంబంధించిన నిబంధనలను పునర్ వ్యవస్థీకరిస్తోందని, ఈబీ5 వీసా పథకంలోనూ మార్పులు ఉండవచ్చని తెలిపారు. ఈ వీసాను పొందడానికి ఇప్పటివరకు వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టాల్సి ఉందని, పెట్టుబడి పెట్టే మొత్తాన్ని మరింత పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకోసం వీసా పొందాలనుకునే వారికి 30 నుంచి 60 రోజుల సమయం ఇస్తుందని తాము అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వీసాల జారీ విషయంలో అమెరికా ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, దీని ద్వారా ప్రతి ఏడాది 10 వేల మంది అమెరికన్లకు ఉపాధి దొరుకుతోందని వివరించారు. ఈ వీసా పొందే వెసులుబాటును ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది.